తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జూనియర్ డాక్టర్లు హఠాత్తుగా సమ్మెకు దిగడం షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూడాలు అంటున్నారు. నేటి నుంచి అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేస్తున్నామని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆకస్మిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో సమ్మెకు దిగడం సరికాదని కేసీఆర్ హితవు పలికారు. కరోనా విపత్తు వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యతనివ్వాలని కేసీఆర్ తెలిపారు. జూడాల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని, ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ స్టయిఫండ్ ఇస్తామని అన్నారు. సీనియర్ రెసిడెంట్లు, కరోనా సేవల్లో ఉన్న వైద్య విద్యార్థుల గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచారు.
జూడాల సమ్మెపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. జూడాల సమ్మె వెంటనే విరమించకుంటే చర్యలు తప్పవని, కరోనా వేళ సమ్మె చేయడం సరికాదని హెచ్చరించారు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సంయమనం పాటించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ఇలాంటి సమయంలో విధులు బహిష్కరించడం సరికాదని అన్నారు.