దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయడమో, తాత్కాలికంగా వాయిదా వేయడమో చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఊరందరిదీ ఒకదారైతే…ఉలికిపిట్టదొకదారి అన్న చందంగా ఏపీ సీఎం జగన్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా పరీక్షలు జరిపి తీరతామంటూ మంకుపట్టు పట్టడం విమర్శలకు తావిచ్చింది. అయితే, విద్యార్థులకు, టీచర్లుకు, తల్లిదండ్రులకు విషమ పరీక్ష పెట్టవద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్…ఉద్యమం లేవనెత్తారు.
ఆ ఉద్యమ ఫలితం, హైకోర్టు మొట్టికాయలు వెరసి..జగన్ ఇంటర్ పరీక్షల విషయంలో వెనక్కు తగ్గారు. అయితే, ఏదో సామెత చెప్పినట్టు…ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన జగన్ సర్కార్… జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నారా లోకేశ్ మరోసారి రంగంలోకి దిగారు. ఈ సారి కూడా పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థుల గొంతుకను లోకేశ్ వినిపిస్తున్నారు.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోందని, కాబట్టి పది, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చినబాబు లేఖ రాశారు. దేశంలోని 14 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసినా…ఏపీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. 6.7 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారని తెలిపారు.
5 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తమ పరీక్షలపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఈ విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పరీక్షల పేరుతో వారిని కరోనా సెకండ్ వేవ్ లో సూపర్ స్ప్రెడర్ లుగా చేయడం సరికాదని అన్నారు. పది, ఇంటర్ పరీక్షల విషయంలో సీబీఎస్ఈ అవలంబిస్తున్న విధానాన్నే ఏపీ సర్కారు కూడా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరారు.