రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండమన్నారు పెద్దలు. అదే తెలుగులో చెప్పాలంటే ఏ ఎండకా గొడుగు పట్టడం…ఇంకా మాస్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా దువ్వాలో తెలుసుండడం…అందితే జుట్టు…అందకపోతే కాళ్లు పట్టుకోవడం…ఈ తరహా వ్యవహారాలతో ఎదుటి మనుషులను కనికట్టుతో కట్టిపడేయడం…మాటతీరుతో ఆకట్టుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
కానీ, అది కొందరికి వెన్నతో పెట్టిన విద్య. అటువంటి అతికొద్ది మందిలో ఏపీ సీఎం జగన్ ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రీతిలో…దేశంలోని సీఎంలలో జగన్ తీరు వేరయా అనేందుక అనేక ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. ఒకరిపై భక్తితో..లేదంటే భయంతో ….జగన్ ఏం చేసినా దానికి కొంచెం తిక్క…దానికో లెక్క ఉంటాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది.
అసలు విషయం ఏంటంటే…ప్రఖ్యాత టైమ్స్ గ్రూప్ (బెన్నెట్ అండ్ కోల్ మన్) మీడియా సంస్థ చైర్ పర్సన్ ఇందూ జైన్ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇందూ జైన్ సంస్మరణ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ వర్చువల్ సంస్మరణ సభలో ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొని ఇందూ జైన్ కు నివాళులు అర్పించారు. ఒకవేళ కరోనా లేకుంటే జగన్ స్వయంగా ఆ కార్యక్రమానికి హాజరై ఉండేవారన్న టాక్ వస్తోంది.
అయితే, ఏపీలో కరోనా కట్టడికి సంబంధించిన వ్యవహారాలను కూడా వదిలేసి…తాడేపల్లి ప్యాలెస్ లో రిలాక్స్ అవుతోన్న జగన్…తన అమూల్యమైన సమయాన్ని ఈ సంస్మరణ కార్యక్రమానికి కేటాయించడం ఏమిటన్న అనుమానం జనాలకు రావడం సహజం. అహనా పెళ్లంట సినిమాలో కోటా శ్రీనివాసరావు లాగా….ఏదైనా పనిచేస్తే నాకేంటి…? అని ఆలోచించే జగన్….ఈ సంస్మరణ సభలో సంతాపం తెలపడం వెనుక కూడా కారణం ఉంది.
టైమ్స్ గ్రూప్ తో ఉన్న ఒప్పందమే ఈ కార్యక్రమానికి జగనన్నను అటెండ్ అయ్యేలా చేసింది. తనకు అవసరం ఉన్న వారిని కాకాపట్టడంలో జగన్ సిద్ధహస్తుడు. ఇక, తనకు వర్తమానంలో పనికి వస్తున్నవారు..లేదంటే తనకు భవిష్యత్తులో పనికి వస్తారేమో అనుకున్న పవర్ ఫుల్ వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడంలో జగన్ ది అందెవేసిన చేయి.
ఇదేదో ఫ్లోలో చెబుతోన్న విషయాలు కావు. వాటికి పక్కాగా లెక్కలున్నాయి మరి. సీఎం అయిన వెంటనే ప్రధాని మోడీని తొలిసారి ప్రసన్నం చేసుకున్న జగన్…దాదాపు ఆయనకు సాష్టాంగపడినంత పని చేశారు. ఏపీలో కింగులా కనిపిస్తోన్న జగనన్న…మోడీ సాబ్ కు మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నారు అన్న విషయం సగటు వైసీపీ కార్యకర్తలకు అర్థం కాకపోయినా…చాలామంది వైసీపీ నేతలకు ఆ నమస్కారాల వెనకున్న అవసరం ఏమిటో తెలుసు.
తనపై ఉన్న కేసుల విషయంలో భయంతో జగన్ ఏమైనా చేస్తారన్న టాక్ ఉంది. ఆ భయంతోనే ఏపీకి కేంద్రం తీరని అన్యాయాలు చేస్తున్నా..జగన్ నోరు మెదపడం లేదన్న అపప్రద ఉంది. గతంలో ఐ ప్యాక్ అధినేత ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అసిస్టెంట్ పెళ్లికి హాజరయ్యేందుకు జగన్ బీహార్ వెళ్లారు. ఇలా ఏ ఎండకా గొడుగు పట్టే జగన్ ను చూస్తుంటే…పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమాలో జాక్ స్పారో పాత్ర గుర్తుకు వస్తే మాత్రం మీకు వందకు వంద మార్కులు పడినట్టే.