ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను టార్గెట్ చేసిన జగన్ …కక్షా రాజకీయాలకు తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. అయినప్పటికీ, అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న జగన్….యథేచ్ఛగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేసి పైశాచికానందం పొందుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. బనగానపల్లెకు చెందిన ఆయనను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేయడం కలకలం రేపింది. వైసీపీ నేతలదే తప్పైనా సరే అన్యాయంగా జనార్దన్ రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపణలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జనార్దన్ రెడ్డి అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా ఖండించారు.
ముందుగా కాటసాని రామిరెడ్డి అనుచరులు ముగ్గురు జనార్దన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో కనిపించగా…వారిని టీడీపీ కార్యకర్తలు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జనార్దన్‌రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి హఠాత్తుగా ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేడు ఆయనను ఆళ్లగడ్డ కోర్టులో హాజరు పరచనున్నారు. దీంతో, ఈ అరెస్టుపై చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే జగన్ మాత్రం టీడీపీ నేతల అరెస్ట్‌పై దృష్టి పెట్టి కక్షా రాజకీయాలతో ఆనందం పొందుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జనార్దన్‌రెడ్డితోపాటు ఇతర టీడీపీ నేతల అరెస్ట్‌ను ఖండిస్తున్నానని చెప్పారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని, వైసీపీ పాలన మూడు అక్రమ కేసులు, ఆరు అరాచకాలుగా సాగుతోందని దుయ్యబట్టారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలిపెట్టి జనార్దన్‌రెడ్డిని అరెస్ట్ చేయడం ఏమిటని చంద్రబాబు నిలదీశారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జనార్దన్‌రెడ్డి అరెస్ట్ పై లోకేష్ మండిపడ్డారు. కరోనాతో సహ జీవనం చేయాలని చెప్పిన జగన్…ప్రజల్ని కరోనాకి బలిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు పనిలో బిజీగా ఉన్నారని లోకేష్ నిప్పులు చెరిగారు. జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నేతలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ అన్నారు.
అక్రమ కేసులు నిలవవని తెలిసినా ప్రతిపక్ష నేతల్ని వెంటాడి, వేధించి జైలుకి పంపి జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారని లోకేష్ మండిపడ్డారు. గతంలో చేసిన తప్పులకు పదుల సంఖ్యలో అధికారులు జైలుకి వెళ్లారు. ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్న తప్పుడు పనులకు వందల సంఖ్యలో అధికారులు జైలుకు పోవడం ఖాయంమని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కేసులు ఉపసంహరించుకొని బీసీ జనార్దన్ రెడ్డి, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.