స్వల్ప వ్యవధిలో భారీగా ఎదిగిన కంపెనీ ఏదైనా ఉందన్న ప్రశ్న అడిగిన వెంటనే… చాలామంది నోటి నుంచి వచ్చే పేరు అదానీ. నిజమే.. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరిన నాటి నుంచి అదానీ కంపెనీ వేగానికి అడ్డే లేకుండా పోతోంది. అంతకంతకూ విస్తరించుకుంటూ పోతోంది.
అదానీ పట్టుకుంటే బంగారంగా మారిపోతోంది. దీంతో.. ఆ కంపెనీ ఆస్తులతో పాటు.. గౌతం అదానీ ఆస్తులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక భారీ డీల్ ను ఫైనల్ చేసింది అదానీ సంస్థ.
పునరుత్పాదక ఇందన కంపెనీ అయిన ఎస్ బీ ఎనర్జీ ఇండియాకు చెందిన వంద శాతం వాటాను ఆదానీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా రూ.25,500 కోట్లు కావటం గమనార్హం. దేశీయన రీఎనర్జిబుల్ ఎనర్జీ రంగంలో ఇదే అతి పెద్ద కొనుగోలుగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇదే విషయాన్ని అదానీ ఎనర్జీ కూడా చెప్పింది.
ఎస్ బీ ఎనర్జీలో జపాన్ ఇన్వెస్టుమెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ తో పాటు భారతీ గ్రూపు కలిసి ఉన్నాయి. సాఫ్ట్ బ్యాంకు కు 80 శాతం వాటా ఉంటే.. భారతీ గ్రూపునకు 20 శాతం వాటా ఉంది. ఎస్ బీ ఎనర్జీకి నాలుగు రాష్ట్రాల్లో 4.95 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్.. పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజా కొనుగోలుతో అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల మొత్తం సామర్థ్యం 24.3 గిగావాట్లకు చేరుకోనుంది.
2025 నాటికి ప్రపంచంలో అతి పెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థగా.. 2030నాటికి ప్రపంచంలో నెంబరు వన్ పునరుత్పాదక ఇంధన సంస్థగా ఎదగాలన్నది అదానీ ఎనర్జీ లక్ష్యంగా చెబుతారు. ఇందులో తాజా కొనుగోలు మరో అడుగుగా అభివర్ణిస్తున్నారు. ఇటీవల కాలంలో అదానీ సంస్థ నాలుగు కంపెనీల్ని కొనుగోలు చేసింది.
తాజా కొనుగోలు వార్త బయటకు వెల్లడి కావటంతో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 3.74 శాతం లాబ పడింది. దీంతో ఈ షేరు విలువ రూ.1244.30కు చేరుకుంది. అదానీ అనుకుంటే కానిది ఏమైనా ఉంటుందా చెప్పండి. ఈ జైత్రయాత్ర మరెన్నాళ్లో చూడాలి.