కోవాగ్జిన్ టెక్నాలజీని ఇతర సంస్థలకు బదిలీ చేస్తే వ్యాక్సిన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరిగి కొరత తీరుతుందంటూ ఈ నెల 11న కేంద్రానికి లేఖ రాశాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐతే జగన్ ఈ లేఖ రాసిన కొన్ని రోజులకే భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఫార్ములాను వేరే సంస్థలతో పంచుకుంటున్నట్లు, ఇతర సంస్థల్లోనూ కోవాగ్జిన్ డోసుల ఉత్పత్తి జరుగుతున్నట్లు వార్త బయటికి వచ్చింది. ఇక అంతే.. జగన్ అనుకూల మీడియా రెచ్చిపోయింది. సాక్షి సహా ఓ వర్గం మీడియాలో జగన్ లేఖ ప్రభావమే ఇదంతా అంటూ క్రెడిట్ ఏపీ సీఎంకు కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియాలో వైకాపా మద్దతుదారులు కూడా దీని గురించి హోరెత్తించేస్తున్నారు.
కానీ వాస్తవానికి కోవాగ్జిన్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చాలా ముందే పంచుకోవడం, ఏప్రిల్ 15నే వేరే మూడు సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తి మొదలు కావడం గమనార్హం. దీని గురించి వేరే మీడియాల్లో వార్తలు వస్తున్నా సరే.. జగన్ మద్దతుదారులు పట్టించుకోలేదు. కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీ క్రెడిట్‌ను ఏపీ సీఎంకే కట్టబెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు కొనసాగించారు. ఐతే ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నుంచే అధికారికంగా స్పష్టత వచ్చింది. నీతి ఆయోగ్ సభ్యుడైన వీకే పాల్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్ గాలి తీసేశారు. కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలీ గురించి ఢిల్లీ, ఏపీ ముఖ్యమంత్రులు సూచనలు చేసిన నేపథ్యంలోనే ఇది జరిగిందా అని విలేకరులు ప్రశ్నించగా.. ఎవరో చెప్పడం వల్ల కోవాగ్జిన్ టెక్నాలజీ బదిలకీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడమేంటి నాన్సెన్స్ అన్నట్లుగానే ఆయన మాట్లాడారు.
నెల కిందటే ఈ ప్రక్రియ పూర్తయి బిబ్కోల్, ఐఐఎల్, హాఫ్కిన్ సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తి మొదలైన సంగతిని ఆయన ధ్రువీకరించారు. భారత్ బయోటెక్ సంస్థపైనా కుల ముద్ర వేసే ప్రయత్నం చేయడం.. ఏపీకి వ్యాక్సిన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ జగన్ అండ్ కో చేసిన విమర్శల పట్ల కూడా వీకే పాల్ పరోక్షంగా స్పందించారు. శాస్త్రవేత్తల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరించడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి భారత్ బయోటెక్ కోవాగ్జిన్ తయారు చేసిన నేపథ్యంలో దానిపై ఆ సంస్థకు పేటెంట్ ఉండదు. కాబట్టి కేంద్రం కోరినట్లు ఆ సంస్థ వ్యాక్సిన్ టెక్నాలజీని వేరే సంస్థలతో పంచుకోక తప్పదు. ఇదీ వాస్తవం.