ఏపీ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కరోనా వైద్య సాయం కోసం వెళుతున్న అంబులెన్సుల్ని సరిహద్దు ప్రాంతాల్లో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్న వైనం ఇప్పుడు కాక పుట్టేలా చేస్తోంది.
ఒకవైపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అంబులెన్సుల్ని ఎట్టి పరిస్థితుల్లో అపొద్దంటూ చెప్పినప్పటికి.. ఏపీ వాహనాల్ని తెలంగాణ పోలీసులు ఆపేయటాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తప్పు పట్టారు.
వాహనాల్ని ఇంతలా ఆపుతుంటే ఏపీ అధికారపక్ష నేతలు కిమ్మనకుండా ఉండటాన్ని ఏపీ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు.
దీంతో.. వైసీపీ నేతలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో సజ్జల స్పందించారు.
తమ వాళ్లను తాము చూసుకోవాలనే పట్టుదలలు పెరుగుతున్నాయని.. దీనిపై సంయమనంతో వ్యవహరిస్తున్నామని.. న్యాయస్థానాల్ని ఆశ్రయించి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతాయన్నారు.
ఏపీ రోగులు హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని.. మరెక్కడా లేని సమస్య ఒక్క హైదరాబాద్ కు వెళ్లే వారికే వస్తోందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్ని మానవత్వంతో చూడాల్సిన అంశంగా ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై ఇప్పటికే అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించారన్నారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి..మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్ని తమకిచ్చారని సజ్జల ఫైర్ అయ్యారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన తర్వాత.. రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్ల తర్వాత.. విభజన గురించి.. విభజన చేసిన విధానం గురించి మాట్లాడితే అసహ్యంగా ఉంటుందన్న విషయాన్ని సజ్జల మర్చిపోతున్నట్లున్నారు.
పవర్లోకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత పరువు పొగొట్టుకునే వ్యాఖ్యలు సజ్జల చేయకుంటే మంచిదన్న మాట వినిపిస్తోంది. అర్థమవుతోందా సజ్జలగారు?