కొవిడ్ నిద్రపోనివ్వకుండా ఉంటే.. ఇప్పుడు అది సోకిన వారికి బ్లాక్ ఫంగస్ మాట వణుకు పుట్టిస్తోంది.
మొదటి వేవ్ లో అస్సలు వినిపించని ఈ ఫంగస్ ఇప్పుడు పెను ముప్పుగా మారి ప్రాణాల్ని తీసేలా చేస్తోంది. దీనికి కారణం ఏమైనా.. ఇప్పుడో కొత్త విషయాన్ని గుర్తించారు. పాజిటివ్ అయిన ప్రతి ఒక్కరు అవసరం ఉన్నా లేకున్నా వాడుతున్న మందుల వినియోగం కూడా బ్లాక్ ఫంగస్ డేంజర్ కు కారణమవుతుందన్న మాట వైద్యుల నోట వినిపిస్తోంది.
కొవిడ్ పేషెంట్లు పలువురు వైద్యుల సూచనలు.. సలహాలతో సంబంధం లేకుండా కొందరి మాటల ప్రభావానికి లోనై సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో కొందరిలో అయితే కొవిడ్ లక్షణాలు కనిపించని పరిస్థితి. ఇలాంటి వారికి కొంత మోతాదుతో యాంటీ వైరల్ మందులు ఇస్తే సరిపోతుంది. కానీ.. ఇందుకు భిన్నంగా చిన్నపామును పెద్ద కర్రతో కొట్టాలన్న సంబంధం లేని సామెతను తీసుకొచ్చి.. స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. కొత్త సమస్యల్లో చిక్కుకుంటున్నారు.
అవసరం లేని స్టెరాయిడ్ల వాడకంతో కొవిడ్ పాజిటివ్ నుంచి బయటపడ్డామని భావిస్తున్న వారికి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కొత్త ముప్పులా మారింది. అవగాహన లేకుండా స్టెరాయిడ్లు వాడితే ఇలాంటివి తప్పవని హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి సన్నగిల్లటం.. కళ్లు ఎర్రగా మారటం.. ముక్కుకు సంబంధించిన సమస్యలు రావటంతో పాటు ఇతర సమస్యలు వస్తున్నాయని.. అవన్నీ మామూలు సమస్యలే అనుకున్నంతనే ఐదారు రోజుల్లో ఇవి తీవ్రమైపోతున్నట్లుగా గుర్తిస్తున్నారు.
అప్పటికే ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రమై మెదడుకు వ్యాపించి పరిస్థితి విషమిస్తోందని వైద్యులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్లతో పాటు కేన్సర్.. ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధ పడుతూ రోగనిరోధక శక్తిని అణిచివేసే మందులు వాడే వారిలో స్టెరాయిడ్ల వాడకం కత్తిమీద సాముగా అభివర్ణిస్తున్నారు. వైరస్ బయటపడిన మొదటి ఐదు రోజులు స్టెరాయిడ్స్ అవసరం అస్సలు లేదని.. ఆరేడు రోజులకు జ్వరం తగ్గకున్నా.. ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నా.. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే స్టెరాయిడ్స్ వాడకం అవసరమని చెబుతున్నారు.
స్టెరాయిడ్స్ వాడకం వల్ల షుగర్ కంట్రోల్ లో లేకుండా పోవటం.. ఎముకలు బలహీనంగా మారటం.. చర్మ వ్యాధులకు కారణమవుతుందని చెబుతున్నారు. బీపీ పెరుగుతుందని.. తలనొప్పి.. ఆకలి ఎక్కువ కావటం.. బరువు పెరగటం.. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం లాంటివి తప్పవన్న మాటను వైద్యులు చెబుతున్నారు. సో.. స్టెరాయిడ్ వాడటంతో కొవిడ్ నుంచి బయటపడిపోవచ్చన్న ఆలోచన ఏ మాత్రం మంచిది కాదని.. సరైన వైద్యుల సలహాతో మాత్రమే వీటిని వినియోగించాలని చెబుతున్నారు.