కరోనా పేషెంట్లకు ప్రాణాధారంగా అభివర్ణించే రెమ్ డెసివర్ ఇంజక్షన్లను అక్రమంగా సరఫరా చేయటం.. ఆరు ఇంజక్షన్లను రూ.21వేలకు అమ్మాల్సింది.. ఒక్కొ ఇంజక్షన్ రూ.30వేలకు అమ్ముతున్న దుర్మార్గం ఈ మధ్యన ఎక్కువైంది.
ఇలాంటి దందాలకు పాల్పడే మోసగాళ్లను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ ఉదంతానికి సంబంధించి ఒక షాకింగ్ కోణం బయటకు వచ్చింది.
రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా సరఫరా చేయటంలో వీటి తయారీ సంస్థ అయిన హెటిరో మేనేజరే ప్రధాన సూత్రధారి అని పోలీసులకు తేలింది. దీనికి సంబంధించిన కీలక విషయాన్ని నల్గొండ ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు.
రెమ్ డెసివర్ ను అక్రమంగా అమ్ముతున్న ఆరోపణలతో టాస్క్ ఫోర్సు పోలీసులు మిర్యాలగూడలోని శ్రీ సూర్య ప్రైవేటు ఆసుపత్రి ఫార్మాసిస్ట్ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
అతడ్ని విచారించగా.. డొంక కదిలింది. అక్కడి నుంచి డాక్టర్ అశోక్ కుమార్ ఇంట్లో నుంచి 36 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆయన ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లోని హెటిరో మేనేజర్ బాలక్రిష్ణ.. ల్యాబ్ నిర్వాహకుడు గణపతి రెడ్డితో కలిసి ఈ గలీజ్ దందా చేస్తున్నట్లు గుర్తించారు.
వీరు ఉప్పల్ లోని శ్రీలక్ష్మీ ఏజెన్సీ ద్వారా అక్రమపద్దతిలో విక్రయాలకు పాల్పడినట్లుగా తేల్చారు. ఇలా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ మొత్తానికి పెద్ద తలకాయ మాదిరి హెటిరో సంస్థ మేనేజరే మాస్టర్ మైండ్ గా గుర్తించారు.
ఇప్పటివరకు ఈ దందాను ఏమేరకు సాగించారన్న విషయంపై విచారణ జరుపుతున్నారు.
మరో రెండు రోజుల్లో అన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఉన్నత స్థానాల్లో ఉండి కాసుల కక్కుర్తి కోసం.. ఇలాంటి దందాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో అస్సలు ఉపేక్షించకూడదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.