యావత్ భారత దేశంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆసుపత్రులలో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరతతో అన్ని చోట్లా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ముందుచూపు లేకపోవడంతో ఏపీలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో, పలువురు వైద్యం కోసం హైదరాబాద్ కు పరుగులు పెడుతున్నారు.
అయితే, ఏపీలోని ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్ కు క్యూకడితే అక్కడి ప్రజలకు బెడ్లు దొరకవన్న అభిప్రాయాన్ని తెలంగాణ సర్కార్ వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో అంబులెన్స్ లు బారులు తీరాయి. హైదరాబాద్ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేవని సరిహద్దుల్లోనే ఏపీ నుంచి వస్తున్న వాహనాలను తెలంగాణ పోలీసులు నిలిపివేయడం కలకలం రేపుతోంది.
ఆస్పత్రులనుంచి బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే.. తెలంగాణలోకి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. దీంతో, కరోనా రోగులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని నడిరోడ్డున పడ్డారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అంబులెన్సులకు వేల రూపాయలు చెల్లించి ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్న పేషెంట్లను నడిరోడ్డుపై ఆపేయడంతో బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. అంబులెన్స్ లను అనుమతించాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.