ఎవరెన్ని చెప్పినా.. కరోనాను సింఫుల్ గా అస్సలు తీసుకోకూడదు. అదేం.. చేస్తుందన్న చిన్నపాటు ఏమరపాటు.. దిద్దుకోలేనంత దారుణాలకు దారి తీస్తుందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. కరోనా విషయంలో తక్కువగా అంచనా వేసుకున్న వారంతా వారి కుటుంబాలకు తీరని అన్యాయాన్ని.. ద్రోహాన్ని చేసి వెళ్లిపోయారని చెప్పాలి. ఈ మహమ్మారి విషయంలో.. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న పాత సామెతను పక్కాగా ఫాలో కావాల్సిందే.
అప్పుడు మాత్రమే దీని నుంచి క్షేమంగా బయటపడే అవకాశం ఉంది. అయితే.. కరోనా విషయంలో కొన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు అస్సలు అర్థం కానివిగా మారాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికే వస్తే.. కేసుల నమోదు ఎక్కువగా ఉన్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ బెడ్ల కోసం పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు తగ్గటంపై అసహనాన్ని వ్యక్తం చేసింది.
రోజుకు లక్ష కరోనా టెస్టులు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అంతేకాదు.. వారాంతపు లాక్ డౌన్ లేదంటే కర్ఫ్యూను విధించాలన్న అంశాన్ని ప్రభుత్వం ఆలోచించాలని కోరింది.తాము చేసిన సూచనను గడువు కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని కోరింది. తెలంగాణ డీజీపీతో పాటు.. వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. కరోనా కేసుల విషయంలో హైకోర్టు ఇలా వ్యాఖ్యానిస్తే.. రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యలు మరోలా ఉండటం గమనార్హం.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసులు అదుపులో ఉన్నాయని.. వ్యాక్సిన్ కు.. ఆక్సిజన్ పడకలకు ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో రోజుకు 120 టన్నుల ఆక్సిజన్ అవసరమైతే.. తాము 400 టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంచామని.. ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. కేసీఆర్ కు కరోనాతో ఇబ్బంది పడుతున్నా.. నిత్యం తమకు ఆదేశాలు ఇస్తూనే ఉన్నారని.. కరోనాకు భయపడాల్సిన అవసరమే లేదన్నారు. ఓపక్క హైకోర్టు రాష్ట్రంలో తక్కువగా చేపడుతున్న పరీక్షల గురించి ప్రస్తావిస్తే.. దాని గురించి క్లారిటీ ఇవ్వని సోమేశ్.. అంతా బాగుందంటూ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వినిపించటం గమనార్హం. కరోనా లాంటి మహమ్మారి విషయంలో అంతా బాగుందన్న మాటకు మించిన తప్పు మరొకటి ఉండదన్నది సోమేశ్ కు ఎప్పటికి అర్థమవుతుందో?