ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోన్న సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఏపీ సీఎం జగన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఏపీలో కేసులు పెరుగుతున్నాయని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కు పాలనానుభవం లేదని, అందుకే కరోనాను కట్టడి చేయలేక ఏపీలో కరోనా మృతుల శవాలు శ్మశానాల ముందు క్యూ కడుతున్నాయని ఆరోపిస్తున్నారు.
హుద్ హుద్ తుపాను వంటి విపత్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడిన రాజకీయ చాణక్యుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఏపీకి సీఎంగా ఉండి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముందుచూపును, ప్రణాళికలను, అనుభవాన్ని ప్రశంసిస్తూ చంద్రబాబుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లేఖ రాశారు.
గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) తరఫున విలువైన సూచనలతో నివేదిక అందించారని చంద్రబాబును ఆయన కొనియాడారు. కరోనా కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్ 19న ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు పంపిన నివేదికపై రాజీవ్ కుమార్ స్పందించారు. చంద్రబాబు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
లాక్ డౌన్ సమర్థ నిర్వహణలో ఒక కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని.. వివరణాత్మక విశ్లేషణలతో డేటా ఆధారిత విధానాన్ని అవలంబించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ సంక్రమణ, వ్యాప్తి, ఉనికిని గుర్తించడం కోసం సాంకేతిక పరిష్కారాలు ఏర్పాటు చేస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు. డేటా కలెక్షన్, రియల్‌టైం గవర్నెన్స్‌తో ఏకీకృత డ్యాష్ బోర్డ్ ఏర్పాటు వంటి సూచనలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. త్వరలోనే నీతి ఆయోగ్ సభ్యులు జీఎఫ్ఎస్టీ రీసెర్చ్ బృందాన్ని సంప్రదిస్తారని చెప్పారు.
కాగా, కరోనా కట్టడిడికి గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) అనే స్వచ్ఛంద సంస్థను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని వివిధ వర్గాలకు చెందిన మేధావులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను సేకరించి ఓ నివేదికను ఏప్రిల్ 19న ప్రధానికి పంపించారు. దీనికి ప్రధాని కూడా చంద్రబాబుకు స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబును అభినందించారు. ఆ నివేదికలోని అంశాలను నిశితంగా పరిశీలించిన నేపథ్యంలో చంద్రబాబుకు నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ లేఖ రాసి ప్రశంసించారు.