భారత్ లో కరోనా మరణ మృదంగం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకు 3లక్షల కేసులు నమోదవుతుండడం, రెండువేలకు పైగా మరణాలు సంభవిస్తుండడం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే భారత్ పై పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించాయి. భారత్ లోని తమ పౌరులు వెనక్కి రావాలని, భారత్ కు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ఆదేశించాయి.
ఈ క్రమంలోనే భారత్ లో ఉన్న తమ పౌరులకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి స్వదేశానికి వచ్చే తమ పౌరులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న తేదీకి 14 రోజులలోపు భారత్లో ఉన్న తమ దేశ పౌరులు ఎవరైనా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెడితే ఐదేళ్ల జైలు శిక్ష లేదంటే 66 వేల డాలర్ల (రూ. 49 లక్షలు) జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
భారత్లో 9 వేల మంది ఆస్ట్రేలియన్లు నివసిస్తుండగా, వారిలో కనీసం 600 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే, బయో సెక్యూరిటీ చట్టం కింద తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధనల నుంచి ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణ సిబ్బందికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను ఆస్ట్రేలియా ఇప్పటికే నిషేధించింది. మే 3 నుంచి తమ ఆదేశాలను కాదని వస్తే జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. మే 15 తర్వాత ఈ ఆంక్షలపై మరోసారి సమీక్షించనున్నామని తెలిపింది.