ఈ మధ్యన తెలుగోళ్ల క్రియేటివిటీ అదిరిపోతోంది. డిజిటల్ యుగంలో యూత్ చెలరేగిపోతోంది. సమయానికి తగ్గట్లు.. సందర్భాన్ని తమకు అనువుగా మార్చుకోవటం.. అందరికి ఆకట్టుకునేలా చేస్తున్నకొన్ని ప్రయత్నాలు ట్రెండ్ సెట్టింగ్ గా మారుతున్నాయి.
తాజాగా అలాంటిదే.. ‘జీలోల్ల లగ్గం పత్రిక’ పేరుతో నెట్టింట వైరల్ అవుతున్న పెళ్లి శుభలేఖ. కరోనా కాలంలో పెళ్లేంది బాసూ? అన్న మాట ఎవరి నోట రాకుండా ఉండేలా ఈ పెళ్లిని డిజైన్ చేయటం స్పెషల్ గా చెప్పాలి.
ఆ మాటకు వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఇదే విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఏ పెళ్లి పత్రికలో చూసినా శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అని ఉండటం కామన్. కానీ.. ఈ వైరల్ శుభలేఖలో స్టార్టింగ్ స్టార్టింగే.. శానిటైజర్ ఫస్ట్.. మాస్క్ మస్ట్.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అంటూ రూల్స్ ను బ్రేక్ చేసేశారు.
కరోనాటైంలో సరికొత్తగా రూపొందించిన ఈ పెండ్లి కార్డు కత్తిలా ఉండటమే కాదు.. ప్రతి లైన్ లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించారు. తమ పెండ్లిని ఆన్ లైన్ లో చూడాలన్న మాటకు.. మరోలైన్ ను అదనంగా జత చేసి.. ఈ పెండ్లి పత్రికను చదివినోళ్ల ముఖంలో నవ్వులు పూసేలా చేశారు.
ఇంతకీ వారు చేసిందేమంటే.. ‘వధూవరులకు కరోనా నెగిటివ్.. మరువకుండా మీ ఫోన్ ల 1జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా.. ఐసోల్లు.. ముసలోల్లు అందరూ ఫోన్ ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్ లైన్ లో ఆశీర్వదించగలరు. విందు.. లైవ్ లో తల్వాలు.. పడ్డంక ఎవ్వరింట ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్ ఉంది కానీ ఎవరింట్లో వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన 15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి. దానని వ్లోగ్ లో పెడతాం’’ అంటూ వినూత్న ఆఫర్ ఇచ్చేశారు.
పెళ్లి అన్నంతనే చదివింపుల కార్యక్రమం ఉంటుంది కదా? దాన్ని కూడా మిస్ చేయకుండా ఈ శుఖలేఖలో చెప్పేశారు. పెండ్లి కానుకల్ని గూగుల్ పే.. ఫోన్ పే ద్వారా పంపాలంటూ క్యూఆర్ స్కాన్ చేయాలని పేర్కొన్నారు.
ఇంతకీ.. ఇంత వినూత్నంగా.. వెరైటీగా ప్లాన్ చేసిన శుభలేఖ ఎవరిదంటారా? అక్కడికే వస్తున్నాం. ప్రముఖ యూ ట్యూబర్.. మై విలేజ్ షో సభ్యుడు అనిల్ ది.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన అనిల్ తన పెండ్లిని మే ఒకటిన చేసుకుంటున్నాడు. దీనికి తన క్రియేటివిటీ అంతా రంగరించి.. పెండ్లి లేఖను సిద్ధం చేశాడు. అదిప్పుడు నెట్టింట సందడి సందడి చేస్తోంది.