ఇంటర్, టెన్త్ పరీక్షలు పెట్టి తీరుతా అని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జగన్ కి ఏపీ హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. ఇది పరీక్షలకు సమయం కాదని అభిప్రాయపడింది. రెండ్రోజుల సమయం ఇస్తూ విచారణ వాయిదా వేసింది.
కోర్టులో ఏం జరిగింది?
ఏపీ హైకోర్టులో పరీక్షలు పెట్టాలా వద్దా అన్న అంశంపై సుదీర్ఘ విచారణ జరిగింది. ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం పునపరిశీలన చేసుకోవాలి అని హైకోర్టు తెలిపింది.
పిటిషనర్ల తరపున సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో పస లేదు. అనేక సందేహాలకు సమాధానాలు లేవు. ఇది దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల జీవితానికి సంబంధించిన విషయం. అంత మంది పరీక్షల్లో భాగం కావాల్సి ఉన్నందువల్ల ప్రభుత్వం వెంటనే పునపరిశీలన చేసుకోవాలి అని హైకోర్టు సూచించింది.
మే 3వ తేదీకి కేసు విచారణ వాయిదా వేస్తున్నాం. అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలి. కోవిడ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా? అన్న అనుమానం వ్యక్తంచేసింది.
కోవిడ్ తో ఉన్న విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది సమాధానంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. కోవిడ్ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా? మీ కోణంలో తప్ప విద్యార్థుల కోణంలో ఆలోచించరా అని కోర్టు నిలదీసింది.
ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతోపాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి హైకోర్టు సూచించింది. మే 3న తుది విచారణ, తీర్పు వెలువడనుంది.