ఈ టెక్ జమానాలో నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులకు సీసీటీవీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే, చాలా పోలీస్ స్టేషన్లలో మాత్రం సీసీటీవీ కెమెరాలు ఉండవు. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఏపీలోని మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లలో 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు పెట్టారని, మిగిలిన స్టేషన్లలో కెమెరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జైళ్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
గతంలో కూడా కోర్టు ఆదేశాలతో జైళ్లలో సీసీ కెమెరాలను అమర్చారు. కానీ, నిర్వహణ, సాంకేతిక కారణాలతో చాలా కెమెరాలు పని చేయడం లేదు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఫాలో కావడం లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు… సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి మరోసారి కీలక ఆదేశాలను జారీ చేసింది. మరి, ఈ సారైనా ఏపీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.