నాలుగేళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళకు.. భారత సంప్రదాయాలు.. సంస్క్రతి మీద ఆసక్తి ఉన్న ఒక వీవీఐపీ విదేశీ మహిళ ఒకరు రావటం.. అస్వస్థతకు గురైన ఉదంతం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్దది.. అత్యంత ముఖ్యమైన మత సమ్మేళనంగా కుంభమేళా ను అభివర్ణిస్తారు. దీనికి సుమారు 40 కోట్ల మంది హాజరవుతారన్నది ఒక అంచనా. కుంభమేళా ప్రారంభమైన మొదటి రోజే 50 లక్షలకు పైగా ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్ సతీమణి లారెన్ పావెల్ జాబ్స్ హాజరయ్యారు. ఆమెకు అలవాటు లేని కొత్త వాతావరణంతో పాటు.. కుంభమేళాలో ఉండే పరిస్థితుల కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారు.
ఈ వివరాల్ని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసనంద గిరి మహారాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు ట్రీట్ మెంట్ జరుగుతోంది. ఆమె కోలుకున్న తర్వాత త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాన్ని ఆచరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమె గతంలో ఎప్పుడూ వెళ్లలేదని.. లారెన్ చాలా సాదాసీదాగా ఉంటారని.. పూజా సమయంలోనూ తమతోనే ఆమె ఉండేవారని కైలాసనంద గిరి మహారాజ్ పేర్కొన్నారు.
కుంభమేళాకు వచ్చిన లారెన్ పావెల్.. తన పేరును కమలగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె గతంలో ఒకసారి భారత్ కు వచ్చారు. ఇది రెండోసారి. ఈసారి ధ్యానం చేసుకోవటానికి మన దేశానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం లారెన్ పావెల్ జాబ్స్ ఈ రోజు (బుధవారం, జనవరి 15)వరకు ఆమె నిరంజినీ అఖారా క్యాంప్ లోని కుంభ్ టెంట్ సిటీలో ఉంటారని.. అనంతరం ఆమె అమెరికాకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
ఎందుకంటే.. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆమె హాజరు కానున్నారు. మంగళవారం జరిగిన మొదటి పవిత్ర స్నానానికి సుమారు 3 నుంచి 4 కోట్ల మంది వరకు హాజరైనట్లుగా చెబుతున్నారు.