విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వైసీపీ హయాంలో కూడా ప్రకటనలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా గతానికి భిన్నంగా ఆ అంశంపై ఆయన స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. జగన్ హయాంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణకు మోదీ వచ్చిన సందర్భంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు అని లక్ష్మీనారాయణ స్పందించిన తీరు ఇప్పటిలా లేదు.
విశాఖలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అంశంపై ప్రకటన చేయాలని లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. కానీ, గతంలో అలా చేయలేదు. ఇక, విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేయాలని, లేదంటే ప్రత్యేకంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు గనలు కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. జగన్ హయాంలో మాత్రం కేవలం పైపై ప్రకటనలకు పరిమితమైన లక్ష్మీనారాయణ ఇప్పుడు మాత్రం డిమాండ్లు చేస్తున్నారు. జగన్ కు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని గతంలో వచ్చిన విమర్శలకు ఊతమిచ్చేలా ఆయన తాజా కామెంట్లు ఉన్నాయి.
కక్ష్యా పూరిత చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావని హితవు పలికిన ఆయన..జగన్ హయాంలో ఈ మాట చెప్పి ఉంటే బాగుండేది. చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు..చంద్రబాబు సర్కార్ అదే చేస్తోంది. ఇకపై అయినా ఆయన నిష్పక్షపాతంగా వ్యాఖ్యలు చేస్తారా లేదా అన్నది వేచి చూద్దాం.