మహమ్మారి కరోనా యావత్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం హెచ్ఎంపీవీ(హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కలకలం సృష్టిస్తోంది. చైనాలో వెలుగుచూసిన హెచ్ఎంపీవీ ఇండియాలోకి కూడా ఎంటర్ అయింది. బెంగళూరులో, సేలం, అహ్మదాబాద్, చెన్నైలలో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రాణాలు తీసేంత భయంకరమైన వైరస్ కాదని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఓవైపు వైద్య నిపుణులు చెబుతున్నా.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఈ వైరస్ కరోనా కంటే డేంజర్ అంటూ కొందరు ఊదరకొడుతున్నారు.
ఈ తప్పుడు ప్రచారంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. నిజానికి హెచ్ఎంపీవీ పుట్టిందని చెబుతున్న చైనాలో పరిస్థితి అంతా నార్మల్ గా ఉంది. ఇది మరెవరో కాదు చైనాలో ఉన్న మన ఇండియన్స్ చెబుతున్న మాట. హెచ్ఎంపీవీ అనేది కొత్తది కాదు, ప్రమాదకరమైనది కాదు.. సీజనల్ గా వచ్చే జలుబు లాంటిదే. కాకపోతే ఐదేళ్ల లోపు పిల్లలను, వృద్ధులను కొంచెం ఇబ్బంది పెట్టొచ్చ. ఈ క్లారిటీ చైనీయులకు ఉంది.
అందుకే వారేమి హడావుడి పడటం లేదు. మహా ఆయితే ఓ మాస్క్ తో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్పటల్స్ ఖాళీ లేకపోవడం, ఎమర్జెన్సీ, లాక్డౌన్, అంటూ జరుగుతున్న ప్రచారాన్ని గుడ్డిగా నమ్మి గందరగోళానికి గురికావొద్దని చైనా నుంచి పదు సంఖ్యలో ఇండియన్స్ సందేశాలు పంపుతున్నారు. వైరస్ ఫీవర్ ఇండియాలో ఉన్నంత చైనాలో లేదని చెబుతున్నారు. లేనిపోని భయాలకు అపోహలకు తావివ్వకుండా, అవాస్తవాలు ప్రచారం చేయకుండా.. హెచ్ఎంపీవీని మామూలు జలుబు మాదిరిగానే భావించి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచనలు చేస్తున్నారు.