తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా ఏ మాత్రం కలిసి రావటం లేదు. తొలి వేవ్ లో ఆయన తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తీరుకు భిన్నంగా లాక్ డౌన్ వేళ తరచూ ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు.. పొరుగున ఉన్న ఏపీ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఫాలో అయ్యేవారు.
ఆయన చెప్పే సూచనలు.. సలహాల్ని వినేవారు. కొందరు పాటించేవారు కూడా. తర్వాతి కాలంలో కేరోనా ఇష్యూపై కేసీఆర్ రియాక్టు కావటం మానేయటమే కాదు.. ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.
అదే సమయంలో.. కరోనా కేసులు.. మరణాల్ని తెలంగాణ ప్రభుత్వం దాస్తుందంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. తాజాగా నెలకొన్న సెకండ్ వేవ్ వేళలోనూ హైకోర్టు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో రాత్రిళ్లు కర్ఫ్యూను విధించటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా హైకోర్టుకు తెలంగాన ప్రభుత్వం ఒక నివేదికను అందజేసింది. అందులో గడిచిన 25 రోజుల్లో 341 మంది కరోనా కారణంగా మరణించినట్లుగా పేర్కొన్నారు. ఇదిప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు.. 23.55 లక్షల టెస్టులు నిర్వహించినట్లుగా వెల్లడించింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం కరోనా పాజిటివ్ రేటు 3.5 శాతం ఉన్నట్లుగా కేసీఆర్ సర్కారు వెల్లడించింది. మద్యం దుకాణాలు.. పబ్ లు నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకున్నట్లుగా తన నివేదికలో పేర్కొంది.
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. మరణాల విషయంపై కేసీఆర్ సర్కారు హైకోర్టకు ఇచ్చిన నివేదికపై ఇప్పుడు కొత్త వాదన మొదలైంది. ఎందుకంటే.. నిన్నటి మీడియా రిపోర్టుల ప్రకారమే.. ఒక్క ఆదివారం హైదరాబాద్ లోని రెండు ఆసుపత్రుల్లోనే (గాంధీ.. టిమ్స్) కొవిడ్ మరణాలు 115 అన్నట్లుగా పేర్కొన్నాయి.
తాను రాసిన అంకె పక్కన క్వశ్చన్ మార్కు పెడుతూనే.. తన దగ్తర ఉన్న వివరాల్ని వెల్లడించారు. సదరు మీడియా సంస్థ లెక్కల ప్రకారం గాంధీలో 75.. టిమ్స్ లో 40 మంది కరోనా రోగులు మరణించినట్లు పేర్కొన్నారు.
అంతేకాదు.. గడిచిన మూడు రోజుల్లోనే ఇంచుమించు ఇదే సంఖ్యకు మరణాలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ అది వంద చొప్పున వేసుకున్నా.. ముందు మూడు రోజుల్లోనే మూడు వందల మరణాలు.. ఆదివారం నాటి మరణాలు 115గా లెక్కిస్తే.. నాలుగు రోజులకే 415 మరణాలుగా లెక్క తేలుతాయి.
అలాంటప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కోవిడ్ మరణాలపై తాజాగా ప్రభుత్వం పాతిక రోజుల్లో 400 లోపే మరణాలు అని చెప్పటంపై కోర్టు ఎలా రియాక్టు అవుతుందన్నది ప్రశ్నగా మారింది.
ఇప్పటికే కోవిడ్ మరణాలపై ప్రభుత్వం లెక్క చెప్పటం లేదని.. దాస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివేళ.. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారం.. మీడియాలో వస్తున్న లెక్కలకు పొంతన లేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ప్రశ్నగా మారింది. చూస్తుంటే.. మరోసారి కేసీఆర్ సర్కారుకు తలంటు పోసే ప్రోగ్రాం తప్పదన్న అంచనా వ్యక్తమవుతోంది.