ఐదు రాష్ట్రాలకు గవర్నర్లు నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఐదుగురిలో ముగ్గురు ఇప్పటికే గవర్నర్లుగా వ్యవహరిస్తున్న వారు కాగా.. మరో ఇద్దరు కొత్త వారికి గవర్నర్ గిరి దక్కింది. మొత్తం ఐదుగురిలో ప్రస్తుతం మిజోరం గవర్నర్ గా వ్యవహరిస్తున్న తెలుగు ప్రాంతానికి చెందిన డాక్టర్ కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అదే విధంగా బిహార్ కు గవర్నర్ గా వ్యవహరిస్తున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కేరళ గవర్నర్ గా నియమించారు. ప్రస్తుతం కేరళ గవర్నర్ గా వ్యవహరిస్తున్న మహ్మద్ ఖాన్ ను బిహార్ కు బదిలీ చేయటం గమనార్హం. ఇప్పటివరకు అప్రాధాన్యత రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్న హరిబాబుకు కీలక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
మిజోరం గవర్నర్ గా విజయ కుమార్ సింగ్.. మణిపుర్ గవర్నర్ గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్.. కమ్యూనికేషన్స్) చేసిన ఆయన అదే వర్సిటీ నుంచి పీహెచ్ డీ పొందారు.
ఆ తర్వాత తాను చదువుకున్న ఆంధ్రా వర్సిటీలోనే అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేశారు చివరకు 1993లో వాలంటరీ రిైటర్మెంట్ ప్రకటించార అంతేకాదు.. క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుంచి ఏపీ బీజేపీలో బలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేగానే కాదు ఎంపీగానూ బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలబడి విజయం సాధించారు.
2021 జులైలో తొలిసారి ఆయన్ను మిజోరం గవర్నర్ గా నియమించారు. తాజాగా ఆయన్ను ఒడిశాకు గవర్నర్ గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఆయన స్థానంలో హరిబాబును నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నియామకంతో హరిబాబు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఎంతటి సానుకూలంగా ఉందన్నది అర్థమవుతుందని చెబుతున్నారు.