జగన్ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ బోర్డుకు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ నిర్మించనుంది.
ఈ రోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయించామని టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దేశం నలుమూలలా టీటీడీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించదలచామని, అందుకోసం కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. భక్తులకు అందించే సేవలు, భక్తుల ఇబ్బందులు, సమస్యలు తెలుసుకోవడం కోసం ఫీడ్ బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
భక్తులకు మరింత వేగంగా అన్న ప్రసాదాలు అందించేందుకు అన్నప్రసాద తయారీ కేంద్రంలో 258 మంది సిబ్బందిని అదనంగా నియమిస్తామన్నారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేసి హోటళ్లపై నిఘా ఉంచుతామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. శారదా పీఠానికి కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంటామని చెప్పారు.