హీరో అల్లు అర్జున్ అరెస్టు, విడుదల, విచారణ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరు కావడం, ఆయనపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతోంది అని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ గ్యాప్ రాకుండా తాను చూస్తానని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు.
ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిలా ఉండి సమన్వయం చేస్తానని, వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తానని దిల్ రాజు చెప్పారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన తాను నిన్న రాత్రి వచ్చానని, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం శ్రీతేజ్‌ను పరామర్శించానని, శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ ను కలిశానని తెలిపారు. శ్రీ తేజ్ కుటుంబాన్ని ఆదుకుంటామని, భాస్కర్ కు ఆసక్తి ఉంటే ఇండస్ట్రీలోనే ప్రైవేటు ఉద్యోగం కల్పిస్తామని భరోసానిచ్చారు.
సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, కావాలని ఎవరూ చేయరని చెప్పారు. దిల్ సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు సినిమా చూసి వినోదం పొందేందుకు రేవతి కుటుంబం సంధ్య థియేటర్ కు వచ్చిందని అన్నారు. రేవతి కుటుం బాధ్యతను ఇండస్ట్రీ, ప్రభుత్వం తరఫున తాను తీసుకుంటానని అన్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, ఆయన చెప్పిన విషయాలు మీడియాకు వెల్లడించానని అన్నారు. త్వరలో అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని చెప్పారు. రేపో, ఎల్లుండో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇస్తానని చెప్పారని, ఇండస్ట్రీ నుంచి కొందరు వెళ్లి రేవంత్ ను కలుస్తామని చెప్పారు.