వైసీపీ హయాంలో అమరావతి ని జగన్ సర్వ నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అమరావతికి పునర్జన్మ లభించినట్లయింది. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణ పనులను పట్టాలెక్కించిన చంద్రబాబు…ప్రపంచ బ్యాంకు అండతో ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమరావతిలో మరో రూ. 2,723 కోట్ల పనులకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో చంద్రబాబు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వచ్చే ఏడాది జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. దాంతోపాటు, ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు ముందడుగు వేశారు. అమరావతి రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా చర్చించారు. ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది.
మరోవైపు, అమరావతి నిర్మాణం పూర్తి చేయడంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతిపై కొందరు వైసీపీ నేతలు మళ్లీ దుష్ప్రచారం మొదలుబెట్టారని, ఎవరెంత దుష్ప్రచారం చేసినా మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. పోర్టులు ఉన్న ప్రాంతాల్లో శాటిలైట్ సిటీలు నిర్మిస్తామని, అమరావతి తరహాలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరిస్తామని చెప్పారు. ప్రజలపై ఎలాంటి భారం మోపబోమని, అమరావతిలో వచ్చే ఆదాయంతోనే లోన్లు, అప్పు తీరుస్తామని చెప్పారు.