పీసీసీ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి MSR (ఎం. సత్యనారాయణరావు – 87) గత రాత్రి 2.45 గంటలకు మృతిచెందారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న MSR నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఎమ్మెస్సార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గుర్తు చేసుకున్నారని,వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
ఎమ్మెస్సార్ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జరుగనున్నాయి.
పలు పార్టీల నేతలు, ప్రముఖులు ఆయన మృతి పట్ల సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి.. ఎంఎస్ఆర్ మృతికి సంతాపం తెలుపుతూ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెట్టారు.
అంతకు కొద్ది గంటల ముందు కూడా కొన్ని వెబ్ సైట్లలో ఎంఎస్ఆర్ మరణించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కాంగ్రెస్ వర్గాలు ఆయన మృతిచెందినట్లు ప్రకటించాయి.