ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చిక్కుల్లో పడింది. వీరిద్దరూ జంటగా నటించిన `పుష్ప 2` చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసినా.. వారికి ఆ ఆనందమే లేకుండా పోయింది. పుష్ప 2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకుని తొక్కిసలాట ఘటన అటు టాలీవుడ్ ను, ఇటు రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తుంది. తొక్కిసలాటలో రేవతి మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లిపోవడం, బన్నీ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి.
అసలు ఈ ఘటనలో తప్పు హీరోదా? జనాలను కంట్రోల్ చెయ్యలేకపోయిన పోలీసులదా? లేక థియేటర్ దా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఇదే సమయంలో అల్లు అర్జున్ మరియు తెలుగు సినీ పరిశ్రమపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇదిలా ఉండగా.. హైదరాబాదులో ఆదివారం అల్లు అర్జున్ నివాసాన్ని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ముట్టడించిన సంగతి తెలిసిందే.
బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా అల్లు అర్జున్ ఇంటి గోడ ఎక్కి రాళ్లు విసురుతూ నానా రచ్చ చేశారు. ఇందుకు సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఆయన ఖండించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ కు ఆదేశించారు.
అయితే ఈ ఘటన అనంతరం మీడియాతో ఓయూ జేఏసీ నేత మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబానికి సహాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన చేస్తుంటే అల్లు అర్జున్ సిబ్బందే తమపై ముందుగా దాడి చేశారని ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ.25 కోట్ల పరిహారం ఇవ్వాలి. లేని పక్షంలో 1500 మందితో వెళ్లి ఆయన ఇంటిని చుట్టుముడతామని సదరు ఓయూ జేఏసీ నేత హెచ్చరించారు. అంతేకాకుండా హీరోయిన్ రష్మిక కూడా తన వంతు బాధ్యతగా బాధిత కుటుంబానికి రూ.15 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం. ఈ విషయంపై రష్మిక ఫ్యాన్స్ మరియు నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పు ఒకరు చేస్తే భారం రష్మికపై ఎందుకు పడాలని ప్రశ్నిస్తున్నారు. రష్మిక కారణంగా ప్రాణ నష్టం జరగనప్పుడు ఆమె ఎందుకు పరిహారం చెల్లించాలని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.