తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని, గత పదేళ్లుగా లేని సంస్కృతి ఇప్పుడు తెరపైకి వచ్చిందని ఆరోపించారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో, 2019-24 మధ్య జగన్ హయాంలో ఇబ్బందులు లేవని అన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.
శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ నాయుడు ఆ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై రాజకీయాల గురించి మాట్లాడవద్దని స్పష్టంగా నిబంధనలు పెట్టామని, కానీ, గౌడ్ వాటిని ఉల్లంఘించారని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎవరిపై అయినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు వద్దు అనే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు.