పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు ఇద్దరిని కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత రాహుల్ గాంధీ తోసేశారని, ఈ క్రమంలోనే ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయాలయ్యాయని, బీజేపీ ఎంపీ ముఖేశ్ రాజ్ పుత్ గాయపడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసివేయడంతో ఆయన తనపై పడ్డారని, రాహుల్ గాంధీ వల్లే తనకు గాయాలయ్యాయని సారంగి చెప్పారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు హత్యాయత్నం కేసు పెట్టడం సంచలనం రేపుతోంది.
రాహుల్ గాంధీ తోసివేయడం వల్లే బీజేపీ ఎంపీలు సారంగి, ముఖేశ్ రాజ్ పుత్ లు గాయపడ్డారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్లు 109, 115, 117, 125, 131, 351ల కింద పోలీసులకు ఫిర్యాదు చేశామని అనురాగ్ ఠాకూర్ మీడియాకు చెప్పారు.
మరోవైపు, ఈ ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీల బృందం బీజేపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, తనను బీజేపీ నేతలు తోసివేయడంతో అదుపు తప్పి పడ్డానని, తన మోకాలికి గాయమైందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు.
సభకు వెళుతున్న తనను, తమ పార్టీ ఎంపీలను బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని, వారు తమను తోసేయడంతోనే బీజేపీ ఎంపీ కిందపడ్డాడని రాహుల్ గాంధీ అంటున్నారు. వీడియో ఫుటేజీ చూస్తే ఏం జరిగిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు.
అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేయగా, వారి తీరుకు నిరసనగా బీజేపీ ఎంపీలు ప్రతి నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష కూటమి ఎంపీల మధ్య పార్లమెంట్ ఆవరణలో స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఒడిశా ఎంపీ సారంగి గాయపడ్డారని రాహుల్ పై పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.