బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కేటీఆర్ మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణ కోసం 55 కోట్ల రూపాయల నిధుల విడుదల విషయంలో గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
ప్రభుత్వం అనుమతి లేకుండా హెచ్ఎండీఏకు చెందిన రూ.55 కోట్లను విదేశీ కంపెనీలకు మళ్లించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఈ గోల్ మాల్ వెనుక ఉన్నారని ఆరోపణలు రావడంతో తాజాగా కేటీఆర్ తోపాటు పలువురు అధికారులపై కేసు నమోదైంది.
ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఏసీబీ నమోదు చేసింది. 13(1)ఏ, 13(2) పీసీ యాక్ట్, 120 ఏ సెక్షన్, ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్’ యాక్ట్ కింద నమోదైన ఈ కేసుల్లో 3 నాన్ బెయిలబుల్ కేసులు ఉండటం గమనార్హం.
ఈ కేసు వ్యవహారం తెలిసిన వెంటనే అసెంబ్లీలో కేటీఆర్ స్పందించారు. సభలో ఈ వ్యవహారంపై చర్చ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సభలో చర్చించేందుకు తాను సిద్ధమని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.