సెలబ్రిటీకి.. సామాన్యుడుకి తేడా లేకుండా అందరి ప్రాణాల్ని తీసే ప్రాణాంతక వ్యాధి ఏదైనా ఉందంటే అది క్యాన్సర్ మాత్రమే. మిగిలిన జబ్బులకు భిన్నంగా ఈ మహమ్మారి ఎందుకు.. ఎవరికి.. ఎక్కడ.. ఎలా ఎటాక్ చేస్తుందో అస్సలు అర్థం కానట్లుగా ఉంటుంది. పూర్తిస్థాయి మిస్టరీగా ఉండే ఈ క్యాన్సర్ కు ఇప్పటికే బలైనోళ్లు లక్షలాదిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అలాంటి క్యాన్సర్ కు చెక్ పెట్టే టీకా కొత్త సంవత్సరంలో ఎంట్రీ ఇవ్వనుంది.
క్యాన్సర్ పీచమణిచే అత్యుత్తమ వ్యాక్సిన్ ను తమ సైంటిస్టులు కనిపెట్టినట్లుగా రష్యా ప్రకటించింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. క్యాన్సర్ టీకాను పూర్తిగా ఫ్రీ. అదేనండి ఉచితం. కొత్త సంవత్సరం ఆరంభంలో క్యాన్సర్ నివారణ టీకాను విడుదల చేయనున్నట్లుగా ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి.
క్యాన్సర్ కు చెక్ చెప్పేందుకు వీలుగా తమ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించిన రష్యా ఆరోగ్యశాఖ.. ఈ టీకాకు సంబందించిన వివరాల్ని వెల్లడిస్తూ.. ‘‘ఈ టీకా మనిషి శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అడ్డుకుంటుంది’’ అని దీన్ని డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టీకా అంశాన్ని రష్యా ఆరోగ్య శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్.. సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ కాప్రిన్ వెల్లడించారు.
అయితే.. ఏ రకం క్యాన్సర్ కు ఈ టీకా సమర్థంగా పని చేస్తుంది? దేన్ని వెంటనే నివారిస్తుంది? అదెలా పని చేస్తుంది? వ్యాక్సిన్ పేరు లాంటి కీలక అంశాలపై వివరాల్ని వెల్లడించలేదు రష్యా. క్యాన్సర్ వ్యాక్సిన్ ను డెవలప్ చేసే విషయంలో తమ శాస్త్రవేత్తలు చాలావరకు విజయం సాధించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది మొదట్లో ప్రకటించటం తెలిసిందే.
ఇప్పుడు ఏకంగా వ్యాక్సిన్ తయారైందన్న విషయంతో పాటు.. వచ్చే ఏడాది ఆరంభంలో దీన్ని ఆవిష్కరిస్తారన్న విషయాన్ని వెల్లడించటం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు చెక్ చెప్పే టీకాను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ ను సిద్ధం చేసింది. ఇది కూడా వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. మొత్తంగా ప్రపంచ ఆరోగ్య చరిత్రలో ఇన్నేళ్లుగా కొరుకుడుపడని క్యాన్సర్ మహమ్మారికి చెక్ చెప్పే వ్యాక్సిన్ ఏ రీతిలో ఉంటుంది? దాని ప్రభావం ఏమిటి? అన్నది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.