ప్రముఖ టీవీ జర్నలిస్ట్ పై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు అడ్డంగా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. క్రమశిక్షణకు మారుపేరులా ఉండే మోహన్ బాబు.. మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని నివాసం వద్దకు వచ్చిన ఓ జర్నలిస్ట్ పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం వివాదం అయింది. దాడిపై అందిన ఫిర్యాదుతో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
అయితే మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు నిరాకరించిందని.. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసిందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదే తరుణంలో మోహన్ బాబు పరారీలో ఉన్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పోలీసులకు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై తాజాగా మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు.
పరారీలో ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మోహన్ బాబు మండిపడ్డారు. ముందస్తు బెయిల్ కోసం తాను పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం తాను తన ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నానని తెలిపారు. ఇకనైనా వాస్తవాలు రాయాలని మీడియాను మోహన్ బాబు కోరారు.