ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదుకావడం.. ఆయనను అరెస్టు చేయడం.. ఆ వెంటనే హైకోర్టులో బెయిల్ రావడం.. తెరమీద శుక్రవారం.. `పుష్ప` చూపించిన ఉత్కంఠ భరిత మాస్ మసాలా `మూవీ` ఇది! అయితే.. దీనివెనుక మరో ఘట్టం కూడా ఉంది.. అసలు కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు మృతురాలు.. రేవతి భర్త ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు కేసు పరిస్థితి డైల్యూట్ అవుతుందన్న చర్చ కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం.. మరో పది నిమిషాల్లోనే జైలుకు వెళ్లడం ఖాయమని.. చెంచల్‌గూడ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని అనుకుంటున్న క్రమంలో ఆయన నిక్షేపంగా ఇంటికి వెళ్లిపోవడం.. మరో ట్విస్టు!!
ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది? ఏం జరగాలి? అనేది కీలకం. వాస్తవానికి అల్లుఅర్జున్ పై నమోదైన కేసు.. హత్య! జరిగింది తొక్కిసిలాటే అయినా.. ఆయన కారణంగానే ఇది జరిగిందని.. తాము రోడ్ షో వద్దన్నా చేశారని.. అసలు తాము థియేటర్వద్దకు రావద్దని చెప్పినా వచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జరిగిన తొక్కిసలాటకు అర్జున్ను బాద్యుడిని చేస్తూ.. ఆయనపై బలమైన 105, 118 సెక్షన్లను పెట్టారు. వీటిలో 118 అనేది తీవ్రమైన సెక్షన్. ఉద్దేశ పూర్వకంగా హత్య చేయడాన్ని ఈ సెక్షన్ సూచిస్తుంది.
ఇక, 105 విషయానికి వస్తే.. హత్యకు సమానం. నేరపూరిత నరహత్యగా పేర్కొంటోంది. ఈ సెక్షన్లో వ్యక్తి మరణానికి కారణం అయ్యే వ్యక్తి తెలిసి కూడా తప్పు చేయడం. అంటే.. తాను రంగంలోకి దిగితే.. మరణం సంభవిస్తుందని తెలిసి కూడా.. చేయడం. ఇది కూడా మరింత తీవ్రమైన సెక్షన్‌గానే న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. మరి ఇంత తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసి.. ఇంటికి వెళ్లి మరీ అరెస్టు చేసిన తర్వాత.. అనూహ్యంగా బెయిల్ రావడం వెనుక ఏదో జరిగిందన్న కారణం వినిపిస్తోంది. ప్రభావితం చేయడమో.. లేక.. మరేదైనా కారణమో ఉందన్నది న్యాయనిపుణులు చెబుతున్న అంశం.
ఇక, ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు మృతురాలి కుటుంబం ప్రకటించిందనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది సాధ్యమేనా? అంటే కానేకాదని అంటున్నారు న్యాయనిపుణులు. ఎందుకంటే.. అర్జున్‌పై నమోదైంది.. సివిల్ కేసు కాదు. ఏదో లాబీయింగ్ చేసుకుని తప్పించుకునేందుకు! హత్య కేసు నమోదు చేశారు. సో.. ఇలాంటి కేసుల్లోనూ రాజీ మార్గం ద్వారా.. సరిచేసుకుంటామంటే.. దేశంలో జరుగుతున్న హత్యలకు సంబంధించిన కేసులు ఏ ఒక్కటీ నిలబడవు. నేరుగా వచ్చి హత్య చేసి.. తర్వాత పరిహారం కింద బాధిత కుటుంబంతో ఒప్పందం చేసుకుంటే ఇక, కోర్టులు ఎందుకు? విచారణలు ఎందుకు? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది.
సో.. మృతురాలి కుటుంబం వెనక్కి తీసుకుంటానని చెప్పినా.. ఈ కేసు విషయంలో సాధ్యం కాదు. కాబట్టి ఎలా చూసుకున్నా.. అర్జున్ విషయం “తెరవెనుక ఏదో జరిగింది!“ అనేది సుస్పష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అది డబ్బుతో మేనేజ్ చేశారా? లేక, అధికారంతో మేనేజ్ చేశారా? సెలబ్రిటీలుగా న్యాయవ్యవస్థను ప్రభావితం చేశారా? అనేదానిపై అనేక సందేహాలు అయితే.. ఉన్నాయి. ఎలా చూసుకున్నా.. అల్లు అర్జున్ అయితే.. ఇప్పటికి తప్పించుకున్నా.. మున్ముందు మాత్రం కోర్టు బోను ఎక్కాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.