కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా అమలు చేయాలని చూస్తున్న జమిలి ఎన్నికలు సంబంధించి కీలక అడుగు పడింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు మంత్రివర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అంతేకాదు, కుదిరితే ఈ రోజు ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
దీంతో, “వన్ నేషన్.. వన్ ఎలక్షన్”..కోసం ప్రధాని మోడీ చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నాలలో కీలక అడుగు నేడు పడినట్లయింది. 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ పెద్దలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఎలాగైనా ప్రవేశపెట్టి పాస్ చేయాలని చూస్తున్నారు. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఈ బిల్లు పంపబోతున్నారని తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాలు జమిలికి వ్యతిరేకంగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎన్డీఏ జమిలి జపం చేస్తోందని ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు, భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు పలు సిఫారసులు చేసింది. ఉభయ సభల్లో ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే 2027లో జమిలి ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. జమిలి ఎన్నికల ప్రకారం రెండు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు……రెండో దశలో సాధారణ ఎన్నికలు జరిగిన 100 రోజుల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికా , నేపాల్ లకు జమిలి ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉంది. మరి, భారతదేశంలో ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే ఎంతవరకు సక్సెస్ అవుతాయి అన్నది వేచి చూడాలి.