కడప జిల్లా ఎంపీ, వైసీపీ కీలక నేత, వైఎస్ జగన్ బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఎన్నో మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతున్న ఈ కేసు అవినాష్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇంతలోనే ఆయనకు మరో సమస్య మొదలైంది. వర్రా రవీంద్రా రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి 41ఎ ప్రకారం కడప పోలీసులు నోటీసులు జారీ చేశారు.
సోషల్ మీడియా కేసుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రాఘవరెడ్డి.. దాదాపు నెల రోజుల తర్వాత పులివెందులలో ప్రత్యక్షమయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆదివారం సాయంత్రం విచారణకు రావాలని రాఘవరెడ్డి ఇంటికి వెళ్లగా నోటీసులు ఇస్తేనే వస్తానని అతను స్పష్టం చేశాడు. దీంతో డీఎస్పీ మురళి నాయక్ రాఘవరెడ్డికి 41ఎ నోటీసులు జారీ చేశారు.
సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలపడంతో.. రాఘవరెడ్డి నేడు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యాడు. డీఎస్పీ మురళి నాయక్ అతన్ని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అవినాష్ రెడ్డికి టెన్షన్ మొదలైందట. వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీతలపై వర్రా రవీంద్రరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టడం వెనక ఉన్న కర్త, కర్మ, క్రియ అన్నీ అవినాష్ రెడ్డినే అని బలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పోలీస్ విచారణలో రాఘవరెడ్డి నోరు విప్పితే.. అవినాష్ రెడ్డి చిక్కుల్లో పడటం ఖాయమవుతుందని అంటున్నారు.