ఏపీలో విద్యార్థులు-తల్లిదండ్రుల సమావేశాలు జరిగాయి. శనివారంరోజు రోజంతా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రబుత్వ పాఠశాల్లోనూ ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. దీనిని మానవ వనరుల శాఖ మంత్రినారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థులు సాధిస్తున్న విజయాలు వంటి అనేక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్‌లు ఇరువురూ.. బాపట్ల జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు విద్యార్థులతో సరదాగా గడిపారు.
మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి అక్కడే నేలపై కూర్చుని భోజనం చేశారు. అనంతరం.. వారి సమస్యలు తెలుసుకున్నారు. తల్లిందండ్రులతోనూ ముచ్చటించారు. అదేసమయంలో విద్యార్థుల అభ్యసన శక్తిని పెంచేందుకు అవసరమైన కొన్ని సూత్రాలను చంద్రబాబు వివరించారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థులను చదువుల పరంగా అభివృద్ధి చేసేందుకు ఉపాధ్యాయులదే బాధ్యతని పేర్కొన్నారు. అదేసమయంలో విద్యాశాఖ అధికారులతోనూ చంద్రబాబు చర్చించారు. సమస్యలు ఉంటే చెప్పాలన్నారు. విద్యార్థులు రాష్ట్రానికి ఉన్న పెద్ద సంపద అని పేర్కొన్నారు.
అనంతరం.. సాయంత్రం వేళలో చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సరదగా కొద్ది సేపు పలు ఆటలు ఆడారు. ఈ క్రమంలో చంద్రబాబు సహా.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఒక వర్గంగా, నారా లోకేష్ ఇతర ఉపాధ్యాయులు మరో వర్గంగా ఏర్పడి `టగ్ ఆఫ్ వార్` ఆడారు. ఈ క్రీడలో ఇరు జట్లు కూడా బలంగానే నిలబడ్డాయి. చివరకు చంద్రబాబు వైపు టీం విజయం దక్కించుకుంది. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు ఫుట్ బాల్ అంటే ఇష్టమని.. చదువుకునే రోజుల్లో ఫుట్ బాల్‌ను ఆడేవాడినని చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లో నిత్యం ఫుట్ బాల్ ఆడాల్సి వస్తోందని.. చిన్నప్పుడు నేర్చుకున్న పుట్ బాల్ ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతోందని ఆయన చెప్పడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవ్వుల్లో మునిగిపోయారు.