జగన్ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయానికి ఎంతో ముఖ్యమైన పేరెంట్-టీచర్స్ మీటింగ్ కు లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్ మీటింగ్ లు మొదలయ్యాయి. ఈ క్రమంలొనే బాపట్ల మున్సిపల్ హైస్కూల్ లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
అధికారులకు, ఉపాధ్యాయులకు చంద్రబాబు పలు సూచనలిచ్చారు. ప్రతి విద్యార్థి మార్కులు, ఐక్యూ తదితర అంశాలను యూనివర్సిటీ స్థాయి వరకు ట్రాక్ చేయాలని చెప్పారు. ట్రాకింగ్ ఆధారంగా ఏ విద్యార్థికి ఏ సబ్జెక్ట్ పై ఆసక్తి ఉంది, ఆ విద్యార్థి ఏం చదివితే బాగుంటుందనే విషయంపై స్పష్టత వస్తుందని చెప్పారు. 9వ తరగతి నుంచే కంప్యూటర్ విద్య బోధించాలని సూచించారు.
ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో చంద్రబాబు మాట్లాడారు. విద్యార్థిని మార్క్స్ రిపోర్టును పరిశీలించి ఆమె ఆసక్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కష్టసుఖాలు, వారి సమస్యల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. కాగా, కడప మున్సిసల్ హైస్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ …టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పేరెంట్-టీచర్ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.