ఉద్యోగ సంఘాల్లో కలకలం రేగింది. తమ హక్కులు సాధించుకునేందుకు గతంలో మాదిరిగా .. ప్రభుత్వం పై ఒత్తిడి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం ఉద్యోగుల ఇష్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే వాదన ఉద్యోగుల మధ్య నెలకొంది. దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న ఈ చివర నుంచి ఆ చివరి వరకు కూడా ఉద్యోగ సంఘాల మధ్య హల్ చల్ చేస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు.. రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నాయి. గత నెలలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. అన్ని సంఘాలు.. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాయి.
ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఉద్యోగ సంఘాల నాయకులు విరుచుకుపడ్డారు. తీవ్రవిమర్శలు కూడా చేశారు. అయితే.. సుప్రీం కోర్టు చురకలతో వెనక్కి తగ్గారు. అయితే.. ఆ సమయంలో ప్రభుత్వం తరఫున గళం వినిపించిన సంఘాలు.. కొన్ని డిమాండ్లను తెరమీదికి తెచ్చాయి. వేతన రివిజన్ సంఘం సిఫారసులు పూర్తిగా అమలు చేయడంతోపాటు.. వేతన సంఘాన్ని మరోసారి నియమించాలని.. కోరుతున్నాయి. అదేసమయంలో గతంలో చంద్రబాబు తమకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దానిని జగన్ 50శాతం అయినా చేయాలని కోరుతున్నారు.
అయితే.. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి సానుకూలత రాలేదు. పైగా ఉద్యోగ సంఘాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాడి తమ హక్కులు సాధించాలని ఉద్యోగుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు.. రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేయించేలా.. ఆదేశాలు ఇప్పించాలని.. కరోనా సెలవులను కూడా వేతన సెలవులుగా పరిగణించాలని కోరుతున్నారు. కానీ.. ఉద్యోగ సంఘాల్లో బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలోని అమరావతి జేఏసీ మాత్రం వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు.
దీంతో బొప్పరాజు.. ప్రభుత్వంతో చేతులు కలిపి.. ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారంటూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇక, వీరిలోనూ గత చంద్రబాబు ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్న వారు ఉన్నారని.. ఇది సరికాదని.. బొప్పరాజు ఎదురు దాడి చేస్తున్నారు. తాను ప్రభుత్వంతో మిలాఖత్ అయినట్టు నిరూపించాలని సవాల్ రువ్వుతున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల మధ్య జగన్ వ్యవహారం.. కలకలం రేపుతుండడం గమనార్హం.