విడాకులు తీసుకున్న అమ్మాయిలను సెకండ్ హ్యాండ్ అని ఎలా అంటారంటూ సినీ నటి సమంత తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయిన సమంత.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా స్ట్రగ్గుల్స్ ను ఫేస్ చేసింది. పెళ్లైన నాలుగేళ్లకే భర్త నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. సమాజంలో ఆడవారు ఎదుర్కొనే సవాళ్లు, విడాకుల తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడింది.
ఇద్దరి మధ్య రిలేషన్ కట్ అయితే అందరూ అమ్మాయి వైపు వేలెత్తి చూపుతారు. దురదృష్టవశాత్తూ అటువంటి సమాజంలో ఉన్నందుకు చాలా బాధపడుతున్నానని సమంత పేర్కొంది. విడాకుల తర్వాత ఈ సమాజం అమ్మాయిలకు సెకండ్ హ్యాండ్, యూజ్డ్, ఆమె జీవితం వృథా వంటి చెత్త ట్యాగ్స్ ఎందుకు తగిలిస్తుందో అర్థంకాదంటూ మండిపడింది. అవి ఆ అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని ఎంతగానో బాధిస్తాయని సమంత చెప్పుకొచ్చింది.
విడాకుల తర్వాత తనపై కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారని, నిజాలు తెలుసుకోకుండా తనను దారుణంగా ట్రోలింగ్ చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. అబద్థాలు కాబట్టే అవాస్తవ ప్రచారాలపై తాను స్పందించలేదని.. కష్టకాలంలో ఎంతోమంది స్నేహితులు, కుటుంబసభ్యులు తనకు అండంగా నిలిచారని సమంత తెలిపింది. ప్రస్తుతం సామ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో సమంత ఓ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. అలాగే మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో మెయిన్ లీడ్ గా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.