భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీతోపాటు ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ వ్యవహారానికి జగన్ ప్రభుత్వంతో లింకులున్నాయని, 2021లో జగన్ హయాంలో పనిచేసిన ఓ అధికారి ఇందులో కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జగన్ పై ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వంలోని పెద్దలకు అదానీ 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయని షర్మిల అన్నారు. 17,500 కోట్ల రూపాయల భారం ఏపీ ప్రజలపై పడేలాగా అదానీ పవర్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని షర్మిల ఆరోపించారు. జగన్ కు వచ్చే లంచాల కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్లు కాదా అని ప్రశ్నించారు.
అదానీ పవర్ ఒక యూనిట్ విద్యుత్ 1.99 పైసలకే పక్క రాష్ట్రాలకు ఇస్తుంటే, ఏపీలో మాత్రం 2.49 పైసలకు జగన్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అదానీ దగ్గర లంచం తీసుకొని ఒప్పుకున్నట్లే కదా అని నిలదీశారు. లంచాలిస్తే రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేందుకు జగన్ సిద్ధం అని షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు. ఒక యూనిట్ కు 0.50 పైసలు అదనంగా ఇవ్వడం వల్ల ఆ భారం ప్రజలపై పడుతోంది కదా అని ప్రశ్నించారు. అదానీ, జగన్ లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలు సోషల్ ీమీడియాలో వైరల్ గా మారాయి.