2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ టికెట్‌పై విజయం దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యే తర్వాత కాలంలో కాంగ్రెస్ పంచకు చేరిన విషయం తెలిసిందే. అయితే.. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ.. బీఆర్ ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ప్రసాదరావును సీజే ధర్మాసనం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరఫున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ తన వద్దకు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వారిపై వేటు వేయాలని స్పీకర్‌కు బీఆర్ ఎస్ నేతలు విన్నవించారు. అయితే.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. స్పీకర్ వద్దేపిటిషన్లు ఉంచాలని.. స్పీకర్ నిర్ణయం మేరకు నడుచుకోవాలని గతంలో ఆదేశించారు. అయితే.. ఈ నిర్ణయం తేలకపోవడంతో మరోసారి బీఆర్ ఎస్ నాయకులు ధర్మాసనం ముందు సవాల్ చేశారు. దీంతో 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని.. తగిన సమయంలో నిర్ణయం వెలువరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.