అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై, కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టే వారి విషయంలో, గంజాయిని అరికట్టి అరాచక శక్తులను కట్టడి చేయడంలో పవన్ తమకన్నా గట్టిగా, కఠినంగా ఉన్నారని చంద్రబాబు కితాబిచ్చారు. పవన్ డిటర్మినేషన్ ను చంద్రబాబు ప్రశంసించారు. సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించేందుకు ఇద్దరం నడుం బిగించామని తెలిపారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను అవమానిస్తూ పోస్టులు పెట్టేవారికి అవే చివరి రోజులని హెచ్చరించారు.
రౌడీ, బ్లేడ్ బ్యాచ్ లపై కఠినంగా ఉక్కుపాదం మోపుతోందని, లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. పోలీసు వ్యవస్థను కూడా సంస్కరిస్తున్నామని అన్నారు. ప్రజాప్రతినిధులు శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని, కాదంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీ డెవలప్మెంట్ కోసం ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్ కావాలని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో కూటమి నేతలు మమేకం కావాలని, త్వరలోనే తాను కూడా ప్రజల్లోకి ముఖాముఖి కార్యక్రమంతో వస్తానని అన్నారు.