అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లు కాదు..పదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తే తాము ఆయన చూపిన మార్గంలో ముందుకుపోతామని పవన్ అన్నారు. చంద్రబాబు ప్రతిభా పాటవాలు, విజన్ రాష్ట్రానికి అవసరమని, ఆయన కలలను సాకారం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ రోజు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీతోపాటు పలు రంగాల్లో తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది చంద్రబాబు చలవేనని చెప్పారు. చంద్రబాబుపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి 53 రోజుల పాటు జైల్లో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుట్రలను ఛేదించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకం కలిగిందని, అందుకు చంద్రబాబుకు అందరం ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. 150 రోజుల కూటమి పాలనతో తమతోపాటు ప్రజలంతా సంతృప్తిగా ఉన్నామని అన్నారు.