కరోనా విషయంలో మన దేశంలోని సీఎంలలోకెల్లా ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు చేసిన ప్రకటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కరోనాకు పారాసిటమాల్, బ్లీచింగ్ చాలంటూ జగన్, కేసీఆర్ లు ఇచ్చిన స్టేట్ మెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇక, కరోనాతో సహజీవనం తప్పదంటూ జగన్ చేసిన ప్రకటనపై విమర్శలు వచ్చాయి.
అయితే, ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా కరోనాతో కలిసి జీవించాల్సిందే అని చెప్పడంతో జగన్ బ్యాచ్….తమ అధినేత మాటే నిజమైందంటూ గొప్పలకు పోయారు. ఇక, ఏపీలో టెస్టుల సంఖ్యను భారీగా పెంచిన జగన్…కేసుల సంఖ్యనూ వెల్లడించడంలో వెనుకాడలేదని వైసీపీ నేతలు చెబుతుంటారు. ఇక తాజాగా వ్యాక్సిన్ ను 18 ఏళ్లకు పైబడిన వారందరికి వేస్తామని , కానీ, ప్రీ కాదని మోడీ చేసిన ప్రకటనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ మే ఒకటి నుంచి 18ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఫ్రీ అంటూ సంచలన ప్రకటన చేశారు.
అయితే, కరోనాపై ఇంత ముందుచూపున్న జగన్…కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎందుకు వెనుకబడ్డారన్న విమర్శలు వస్తున్నాయి. కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో కేంద్రం పరిధిలోని సీబీఎస్ఈతో పాటు.. పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల్ని వాయిదా వేశాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేసి…ఇంటర్ పరీక్షలు వాయిదా వేసింది.
కానీ, జగన్ మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తామంటూ ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో రెండింతలు కేసులు నమోదవుతున్న తరుణంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ విధించడంలోనూ జగన్ ఎందుకు వెనుకబడ్డారో తెలీదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మరోవైపు, బార్లు, వైన్ షాపులతో పాటు జనం అధికంగా గుమిగూడే ప్రాంతాలపై తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ…జగన్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, మరోసారి లాక్ డౌన్ ఉండదంటూ జగన్ స్వయంగా ప్రకటించడంతో జనం కూడా యథేచ్ఛగా బయట తిరుగుతూ కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తక్కువ కేసులున్న సమయంలో కరోనా పేరుతో తిరుపతి సభను రద్దు చేసుకున్న జగన్….పది వేలకు పైచిలుకు కేసులు నమోదవుతున్న సందర్భంలో పరీక్షల పేరుతో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా…కరోనాపై జగన్ నిర్లక్షం ఏపీ ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.