ఏపీలో రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై సీఎం చంద్ర బాబు సంచలన ప్రతిపాదనను అసెంబ్లీలో సభ్యుల ముందు పెట్టారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణపై సరికొత్త ఆలోచన వచ్చిందని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ బాధ్యత అప్పగించే దిశగా ఆలోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అలా చేసిన తర్వాత గ్రామం నుంచి మండల కేంద్రానికి టోల్ చార్జీలు ఉండవని అన్నారు. కానీ, మిగిలిన చోట్ల టోల్ వసూలు చేస్తారని చెప్పారు. బస్సులు, కార్లు, లారీలకు టోల్ చార్జీలుంటాయని, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులకు టోల్ చార్జీలు ఉండవని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ ప్రతిపాదనపై ఎమ్మెల్యేలు సూచనలివ్వాలని, ప్రజలందరినీ వారు కన్విన్స్ చేసిన తర్వాత ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకుపోదామని చెప్పారు. తన దగ్గర మంత్రదండం లేదని, తెలివితేటలున్నాయని, ఆలోచనలున్నాయని అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని రహదారులపై గుంతలు పూడ్చేందుకు, మరమ్మతులకు 850 కోట్ల రూపాయలు కేటాయించామని, ఆ పనులు జరుగుతున్నాయని చెప్పారు. 2025 జనవరి నాటికి ఏపీలో మెరుగైన రహదారులే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.