ఏపీ సర్కార్ తాజాగా రైతన్నలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు ఇకపై ప్రయాస పడాల్సిన పని లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద రైతుల కోసం కొత్త కాన్సెప్ట్ ను అందుబాటులోకి తెచ్చారు. ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేస్తూ వాట్సాప్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే రైతుల కోసం ప్రత్యేకంగా 73373 59375 అనే వాట్సాప్ నెంబర్ ను తీసుకొచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు.
73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి హాయ్ చెబితే చాలు.. సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైం లో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ చేస్తే స్లాట్ బుక్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుగు వాయిస్‌తో సులభంగా అర్థమయ్యే విధంగా వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ధాన్యం అమ్మకానికి స్లాట్ బుక్ చేసుకోవడం ఎలాగో వివరిస్తూ తన ఎక్స్ ఖాతా ద్వారా నాదెండ్ల మనోహర్ ఓ వీడియోను కూడా పంచుకున్నారు. స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేస్తూ కూపన్ కోడ్ తో ఓ మెసేజ్ ను రైతుకు పంపుతారు. దాంతో విక్రయించే తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి రైతులు సులభంగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. ధాన్యం విక్రయించిన తర్వాత డబ్బులు కూడా వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పద్ధతిని ఫాలో అవ్వడం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గంటలకు గంటలు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఎంతో సమయం ఆదా అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదు. 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు… సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైములో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుంది. సులభంగా… pic.twitter.com/TPXmSVDCSp
— Manohar Nadendla (@mnadendla) November 17, 2024