దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపులేషన్ మేనేజ్మెంట్ ఆవశ్యకతపై చంద్రబాబు మాట్లాడారు. దేశంలో 145 కోట్ల జనాభా ఉందని, పాపులేషన్ మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే ప్రపంచంలో భారతీయులను కొట్టేవారే ఉండరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, సరిగా ప్లాన్ చేస్తే 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పనులు చేసి దేశానికి ఆదాయం తేగలరని చెప్పారు.
భారత్కు బ్రిటీషు వారు వచ్చి పాలించినట్లే ప్రపంచ దేశాలకు తెలుగువారు వెళ్లి ఆ దేశాలను ఏలవచ్చని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని, జననాల రేటు బోర్డర్ లైన్ లో ఉందని చెప్పారు. ఇద్దరు పిల్లలుటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులు అనే నిబంధన తీసుకురావాలని అన్నారు. గతంలో తాను ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ అబౌట్ ఎయిడ్స్’ అనే నినాదాన్నిచ్చానని, ఇప్పుడు ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’ అనే పిలుపునిస్తున్నానని చెప్పారు.
ఎన్డీఏ 3.0లో కింగ్ మేకర్ అవుతారని ముందే ఊహించారా అన్న ప్రశ్నకు చంద్రబబు ఆసక్తికర సమాధానమిచ్చారు. ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తాయని ముందే ఊహించామని చెప్పారు.