టాలీవుడ్ టాప్ స్టార్లలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెడ్ అయ్యే పేరు ఏదంటే అల్లు అర్జున్ అనే చెప్పాలి. కొన్నిసార్లు పాజిటివ్ కారణాలతో ట్రెండ్ అయ్యే బన్నీ పేరు.. చాలాసార్లు నెగెటివ్ విషయాలతో ట్రెండింగ్‌లోకి వస్తూ ఉంటుంది. బన్నీ మీద ట్రోలింగ్ జరగడం అన్నది సోషల్ మీడియాలో కామన్ విషయం. గత కొన్నేళ్లలో బన్నీ ప్రవర్తన కారణంగా మెగా అభిమానుల్లోనే ఒక వర్గం అతణ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
వేరే హీరోల ఫ్యాన్స్ కంటే వీళ్లే ఎక్కువగా బన్నీని టార్గెట్ చేస్తూ ఉంటారు. అతడికి సంబంధించి ఏ చిన్న నెగెటివ్ విషయం బయటికొచ్చినా.. దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో మీమ్స్‌తో మోతెక్కించేస్తుంటారు. బన్నీ కూడా వాళ్లకు తరచుగా ఏదో ఒక కంటెంట్ ఇస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి బన్నీ చేసిన ఓ కామెంట్.. ట్రోలింగ్‌కు దారి తీసింది. తన కొత్త సినిమా ‘పుష్ప-2’ రిలీజ్‌కు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీని ప్రమోషన్లలో భాగంగా బన్నీ ‘ఆహా’లో బాలయ్య హోస్ట్ చేసే ‘అన్‌స్టాపబుల్’ షోకు అతిథిగా వచ్చాడు.
ఈ ఎపిసోడ్ నవంబరు 14 నుంచి ప్రసారం కాబోతుండగా.. ముందుగా ప్రోమో వదిలారు. అందులో ‘పుష్ప’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలవడం గురించి బాలయ్య ఓ ప్రశ్న అడిగాడు. దీనికి బన్నీ సమాధానం ఇస్తూ గతంలో తాను నేషనల్ అవార్డు గెలిచిన తెలుగు నటులెవరు అని పరిశీలిస్తే ఒక్కరూ కనిపించలేదని.. అది తన మనసులో ఉండిపోయిందని.. దాన్ని రౌండప్ చేసుకుని ఎలాగైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. ఐతే ఇదే బన్నీ తనకు నేషనల్ అవార్డు వచ్చినపుడు మీడియాతో భిన్నంగా మాట్లాడాడు.
తనకు నేషనల్ అవార్డు వచ్చిందని తెలియగానే తెలుగు నుంచి ఈ ఘనత సాధించిన మూడోవాడినో నాలుగోవాడినో అయ్యుంటానని అనుకున్నానని.. కానీ తనే తొలిసారిగా టాలీవుడ్ నుంచి ఆ అవార్డు సాధించానని తెలిసి షాకయ్యానని బన్నీ వ్యాఖ్యానించాడు. బన్నీ ఇలా కామెంట్ చేసిన వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకొచ్చి.. ప్రస్తుత బన్నీ వీడియో పక్కన పెట్టి అతణ్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై బన్నీ మద్దతుదారులు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు.