వ్యక్తిగతంగా చక్కటి స్నేహం ఉండొచ్చు. అంతకు మించిన ఆత్మీయత ఉండొచ్చు. అలాంటివన్నీ అందరికి తెలియాల్సిన అవసరం లేదు. ప్రజా జీవితంలో ఉన్న వారికి ఒక ఛరిష్మా ఉంటుంది. అలాంటి వారి విషయంలో యోగక్షేమాలు చెప్పే వేళ.. జాగ్రత్తలు తీసుకోవాలి.
తమకున్న అనుబంధాన్ని అందరికి తెలియజేసేలా చేసే వ్యాఖ్యలు.. ట్వీట్లు కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెడతాయి. తాజాగా అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది నటి మంచులక్ష్మి.
కరోనా పాజిటివ్ గా తేలిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు రచ్చగా మారింది. ఆమె పెట్టిన మెసేజ్ కు పలువురు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న ఆయన్ను.. త్వరగా కోలుకోవాలంటే పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ఇంతవరకు ఓకే. తాజాగా మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. పెద్ద ఎత్తున నెగిటివ్ ట్వీట్లు చేస్తున్నారు. ఆమె తీరును వేలెత్తి చూపుతున్నారు.
దీనికి కారణం లేకపోలేదు.. మంత్రిగా ఉన్న కేటీఆర్ ను ఉద్దేశించి మంచు లక్ష్మీ.. ‘త్వరగా కోలుకో బడ్డీ.. ఇప్పుడైతే నా సినిమాలన్నీ చూడు’ అంటూ కాస్తంత సరదాగా ట్వీట్ చేశారు. ఆమె చేసిన ట్వీట్ ను పలువురు తప్పు పడుతున్నారు.
ఒక నెటిజన్ అయితే ఏకంగా.. బడ్డీ ఏంది? కేటీఆర్ గారు నీ దోస్తా.. ఒక రాష్ట్రానికి మంత్రి.. గౌరవంగా మాట్లాడటం నేర్చుకో’ అంటూ ఫైర్ అయ్యారు. మరికొందరు.. నీ సినిమా చూడటం కంటే కరోనాతో ఉండటం బెటర్ అంటూ ఎటకారం చేస్తున్నారు.
కోలుకోవాలన్న మంచు ట్వీట్ ఆమెకు తలంటు పోసేలా మారింది. ఇకనైనా.. ఆచితూచి అన్నట్లు ట్వీట్లు చేస్తే బాగుంటుంది. ఆ విషయాన్ని మంచులక్ష్మీ గుర్తిస్తారా?