అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయభేరీ మోగించారు. అక్కడి ప్రజలు మరోసారి ట్రంప్ కు అధికారాన్ని కట్టబెట్టారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అమెరికాలో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. అధ్యక్షుడి పీఠం అధిరోహించడానికి 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఆరంభంలో ట్రంప్ కు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత అనూహ్యంగా ఆమె వెనుకబడ్డారు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ మేజిక్ ఫిగర్ 270 దాటి 277 ఎలక్టోరల్ ఓట్లతో తన గెలుపును సుగమం చేసుకున్నారు. స్వింగ్ స్టేట్స్ మెుత్తం ట్రంప్‌కే జై కొట్టాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ శ్రేణులు, ట్రంప్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో ట్రంప్ విజయోత్సవ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అమెరికా ప్రజల బంగారు భవిష్యత్తుకు హామీ ఇస్తున్నానని, అమెరికాకు స్వర్ణయుగం రాబోతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన విజయానికి కృషి చేసి ప్రతి ఒక్కరికి ట్రంప్ కృతజ్ఞతలని తెలిపారు.
అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు ఎంతో గట్టిగా పోరాడారని, ఇప్పుడు అదే పోరాటపటిమతో దేశాన్ని మరోమారు అద్భుతంగా తీర్చిదిద్దుకుందామని ట్రంప్ అన్నారు. ఇక ఎన్నికల సందర్భంగా అగ్రరాజ్యాన్ని పరిపాలించే అధ్యక్షుడి జీతం ఎంత ఉంటుంది..? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. గత ఇరవై ఏళ్ల నుంచి అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 400,000 డాలర్లుగా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.3.36 కోట్లు. జీతంతో పాటు అధికారిక విధుల నిర్వహణకు అవసరమైన ఖర్చుల నిమిత్తం ఏడాదికి మరో 50,000 డాలర్లు అంటే దాదాపు రూ.42 లక్షలు అదనంగా అధ్యక్షుడికి ఇస్తారు.