ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత, పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను హోం శాఖా మంత్రి పదవి తీసుకోలేక కాదని, ఒకవేళ తాను హోం మినిస్టర్ అయితే యూపీ సీఎం యోగి లాగా ఏపీలో పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత తాజాగా స్పందించారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, పవన్ కు అన్ని విషయాలు తెలుసని, అందుకే ఆయన అలా మాట్లాడారని అనిత చెప్పారు.
ఇక, పవన్ ఏ కేసు విషయంలో కోపంగా ఉన్నారో కూడా తనకు తెలుసని, త్వరలోనే పవన్ ను కలిసి అన్ని విషయాలపై చర్చిస్తానని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు ఎప్పటికపుడు చేస్తూనే ఉన్నానని అన్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ జిల్లాల్లో లా అండ్ ఆర్డర్ గురించి అనిత చర్చించారని తెలుస్తోంది.